మే 30న క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి: మల్లు రవి

  • పార్టీ క్యాడర్ అంతా కలిసి పనిచేయాలన్న మల్లు రవి
  • ప్రస్తుతం ఎమ్మెల్యే యశస్విని విదేశాల్లో ఉన్నారని వెల్లడి
  • ఇరు వర్గాల మధ్య సమస్యలను పరిష్కరిస్తామన్న రవి

పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాల పరిష్కారానికి అధిష్ఠానం రంగంలోకి దిగింది. పార్టీ బలోపేతం కోసం నేతలు, క్యాడర్ అంతా కలిసి పనిచేయాలని ఎంపీ, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిణామాలపై హైదరాబాద్‌లో స్థానిక నేతలతో భేటీ అయిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ వివాదానికి సంబంధించి ఝాన్సీ రెడ్డి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారని, అయితే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండటం వల్ల రాలేకపోయారని తెలిపారు.


ఎమ్మెల్యే తిరిగొచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి మే 30వ తేదీన కమిటీ ముందుకు హాజరుకావాలని సూచించినట్లు మల్లు రవి పేర్కొన్నారు. పాలకుర్తిలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ స్థానిక నేతలు హరిప్రసాద్, కృష్ణ కిషోర్‌లపై ఎమ్మెల్యే వర్గం ఫిర్యాదు చేయగా.. మరోవైపు ఎమ్మెల్యే, ఝాన్సీ రెడ్డిలు క్యాడర్‌ను పట్టించుకోకుండా వేధిస్తున్నారంటూ కౌంటర్ ఫిర్యాదులు అందాయని ఆయన వివరించారు. ఇప్పటికే కిషోర్, హరిప్రసాద్‌లకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా, వారు ఆధారాలతో సమాధానం ఇచ్చారన్నారు. ఈ సమస్యపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు స్థానిక నేతలతో కలిసి చర్చించి, ఇరు వర్గాల మధ్య సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని మల్లు రవి స్పష్టం చేశారు.



Yashaswini Reddy
Telangana Congress
Palkurthi
Mallu Ravi
TPCC
Jansi Reddy
Internal disputes
Congress Party
Ponguleti Srinivas Reddy
Disciplinary Committee

More Telugu News